బాహుబలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి 15:
రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే అవకాశం ఉందని రైతు, ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. రైతు మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి తో కలిసి శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకుల నుండి రుణం పొందే అవకాశం ఉన్నందున రుణాలకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆ ఊబి నుండి బయటకు తెచ్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన మార్గదర్శకాలు, వాటి అమలుకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రైతులు తమ ప్రైవేటు అప్పులపై రుణాలు పొందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
వడ్డీ వ్యాపారుల చేతుల్లో ఆర్థికంగా నష్టపోతున్నరైతులకు పంట రుణాలతో పాటు, వారు చేసిన ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు మంజూరు చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఇంతకాలం పాటించని బ్యాంకర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ ప్రాధాన్యత రుణాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయడం లేదని, ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు రుణాలు ఇచ్చే నిబంధన గురించి రైతులకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారని రామారావు తెలిపారు.
ఈ పిటిషన్ విచారించిన ఉన్నత న్యాయస్థానం డబ్ల్యూపి(పిల్) 269/2018 ప్రకారం బ్యాంకుల నుంచి రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు పొంద వచ్చని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ ఆదేశాల అమలుకు గాను సంబంధిత బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, అర్హులైన రైతులందరికి ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి రుణాలు మంజూరు అయ్యే విధంగా చూడాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ సేవా సంస్థల చైర్ పర్సన్లకు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గత నెల 27న ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అవసరమున్న రైతులందరికీ, వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోడానికి సంబంధిత బ్యాంకులు పంట రుణాలకు అధనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘ కాలిక రుణాలు మంజూరు చెయ్యాలని, అప్పు అవసరమున్న రైతులందరు వెంటనే సంబంధిత బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఏవైనా కారణాలతో బ్యాంకర్లు రైతులకు ప్రైవేట్ అప్పులపై రుణాలు మంజూరు చెయ్యలేక పోతే, అందుకు గల కారణాలను రాత పూర్వకంగా తెలపాల్సి ఉంటుందన్నారు.
ఎంతో ప్రయోజనకరమైన ఈ కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకొని, ప్రైవేటు అప్పుల నుండి విముక్తి చెందాలన్నారు పోలాడి రామారావు తెలిపారు. ఈ
సమావేశంలో రైతు మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి,ప్రథాన కార్యదర్శి చందుపట్ల నర్సింహా రెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి పాల్గొన్నారు.