ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం సమ్మిరెడ్డి కి వెన్నతో పెట్టిన విద్య . షోకాజ్ కాదు… తక్షణమే బహిష్కరించండి. ప్రణవ్ నాయకత్వాన్ని సమర్థించే వారికే పార్టీలో “చాన్స్”. పార్టీ సీనియర్ నాయకులు కొలిపాక శంకర్

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 27
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ మహావృక్షాన్ని నేలకూల్చడానికి ప్రయత్నిస్తున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డిని వివరణ కోరుతూ హై కమాండ్ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం సమంజసంగా లేదని ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్లు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ముఖ్య అనుచరుడు పార్టీ సీనియర్ నాయకుడైన కొలిపాక శంకర్ పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం హుజురాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుమ్మేటి సమ్మిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాస్తవానికి సమ్మిరెడ్డి హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వాడు కాదని ఆయన ముమ్మాటికి స్థానికేతరుడని తెలిపారు. జమ్మికుంటలో నివాసం ఏర్పరచుకొని మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీలో స్థానం సంపాదించుకొని ఆ తరువాత జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవిని దక్కించుకొని వ్యవసాయదారులను జమ్మికుంట ప్రాంత వ్యాపారులను మిల్లర్లను పీల్చి పిప్పి చేయడం ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడని జమ్మికుంట ప్రాంతంలో ఎవరిని మందలించినను సమ్మిరెడ్డి అవినీతి బాగోతం గురించి అక్రమార్జన గురించి కథలు కథలుగా చెబుతారని కొలిపాక శంకర్ ఆరోపించారు. సమ్మిరెడ్డి ఏ పార్టీలో ఉన్నను ఆ పార్టీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయనను ఎవరైనా చేరదీస్తే అట్టివారినే కాటేస్తారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రణవ్ బాబు వెంట ఉంటూనే పరోక్షంగా ప్రత్యర్ధి విజయం కోసం డబ్బులు తీసుకుని ప్రచారం చేసినట్లు జమ్మికుంటలో తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఈ సందర్భంగా శంకర్ వ్యాఖ్యానించారు.అవినీతిపరుడిగా ముద్రపడిన తుమ్మేటి సమ్మిరెడ్డి ఇతరులు ఇసుక దందా చేస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తరచుగా అధికారులకు ఫిర్యాదు చేయడం.కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వినతి పత్రాలు సమర్పించడం పత్రికా ముఖంగా ఆరోపణ లు గుప్పించడం వంటి చర్యలకు సమ్మిరెడ్డి పాల్పడడం వెనుక ఓ వ్యూహం దాగి ఉందని శంకర్ ఆరోపించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ఇసుక దందా చేసే వారి నుండి కోట్ల రూపాయలను దండుకోవాలనే ఉద్దేశం తోనే ముందుగా పత్రిక ముఖంగా ఆరోపణలు చేయడం.అధికారులను కలిసి ఫిర్యాదు చేసి ఆ తర్వాత డబ్బులు గుంజే ప్రయత్నం చేయడం సమ్మిరెడ్డి వ్యూహంలో భాగమని అసలు విషయాన్ని శంకర్ బయటపెట్టారు.గాంధీభవన్లో ఇంతకుముందు మీడియా ఇన్ఛార్జిగా సమ్మిరెడ్డి పనిచేయడం.కాంగ్రెస్ అగ్రనేతలతో అంతో ఇంతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని అక్రమార్జన చర్య లకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు.సమ్మిరెడ్డి మొన్నటి శుక్రవారం జమ్మికుంటలో తన అనుచరులైన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను చేరదీసి ప్రణవ్ కు వ్యతిరేఖంగా పత్రికా సమావేశం నిర్వహించడం వెనుక ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనాయకుల ప్రమేయం ఉన్నట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందని కొలిపాక శంకర్ వెల్లడించారు. నాయకత్వ సమస్యతో తల్లడిల్లిపోతున్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కు ఎడారిలో గుక్కెడి నీళ్లు లభించిన విధంగా ప్రణవ్ బాబు ఆపత్కాలంలో నియోజకవర్గపార్టీ బాధ్యతలు స్వీకరించడం నిజంగా ఆయనకు కత్తి మీద సాము లాంటిదేనని శంకర్ వ్యాఖ్యానించారు.ప్రణవ్ బాబు బాధ్యతలు స్వీకరించడానికి ముందు జరిగిన ఎన్నికలలో హుజురాబాద్ నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం మూడంటే మూడువేల ఓట్లు మాత్రమే లభించడం నాడు సిగ్గు చేటుగా అనిపించిందని.ఆ ఎన్నికల్లో ఎదురైన పరాభవం గురించి బయటకు చెప్పుకోలేక వేలాదిమంది కార్యకర్తలు మనోవేదనను అనుభవించిన విషయాన్ని శంకర్ గుర్తు చేశారు.ఒక్కనాడు అయినా హుజురాబాద్ నియోజక వర్గ కార్యకర్తల గురించి సమ్మిరెడ్డి పట్టించుకున్నాడా లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్క నిరుపేదకైనా సహాయం చేశాడా అంటూ నిలదీశారు.జమ్మికుంట ప్రాంతానికి చెందిన ఎంతో మంది కార్యకర్తలు వద్దని వారించినప్పటికీ ప్రణవ్ బాబు తనకు తానుగా సమ్మిరెడ్డిని చేరదీసి కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పించి తగిన గౌరవం ఇస్తున్నప్పటికీ ప్రత్యర్థుల ప్రలోభాలకు బానిసలాతయారై నీడనిచ్చిన ప్రణవ్ బాబుకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించడం క్షమించరాని విషయమని శంకర్ ఆరోపించారు.మొన్నటి ఎన్నికలలో ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తూ రికార్డు స్థాయిలో 56 వేల ఓట్ల మైలురాయిని చేరుకున్న ఘనత ప్రణవ్ బాబుకే దక్కిందన్నారు.గత వైభవం దిశగా ప్రణవ్ బాబు నాయకత్వంలో హుజురాబాద్ కాంగ్రెస్ పరుగులు పెడుతున్న తరుణంలో తుమ్మేటి సమ్మిరెడ్డి లాంటి చీడపురుగులు పార్టీలో తయారవుతుండడం దురదృష్టకరమని.ఇప్పటికైనా అతడిని శాశ్వతంగా పార్టీ నుండి బహిష్కరించాలని.ఇకముందు పార్టీలో ఉంటూ సమ్మిరెడ్డి లాగా వ్యవహరించిన నేతలకు ఇదే శాస్తి జరుగుతుందన్న హెచ్చరికలను పార్టీ హైకమాండ్ జారీచేయాలని కొలిపాక శంకర్ కోరారు.ప్రణవ్ బాబు నాయక త్వంలో పనిచేయాలని తపనపడే వారికే పార్టీలో సముచిత మైన స్థానం ఉంటుందని.అలాంటి వారికే పార్టీ పరమైన పదవులు లభించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలని కొలిపాక తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !