హుజూరాబాద్ ఏప్రిల్ 18. బాహుబలం
న్యూస్ ప్రధాని నరేంద్ర మోడీని ఒక నియంత అని, మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని మానవతావాధిగా బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. గురువారం హుజురాబాద్‌లోని వెంకటసాయి గార్డెన్‌లో పార్లమెంట్ ఎన్నికల సమన్వయం కోసం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ…గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. విభజన హామీలను నేటికి అమలు చేయలేదని మండిపడ్డారు. ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. గ్రామ గ్రామంలో బిజెపి బండి సంజయ్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రత్యేక తెలంగాణను తలుపులు వేసి దొంగ దారిన తీసుకుపోయారని, అమరవీరులను ప్రధాని అవమానపర్చారని మండిపడ్డారు. తెలంగాణ అంటేనే బగ్గున మండే నరేంద్ర మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ జిల్లాలో ఏమి చేయలేదు, ఊర్లలో ఏం చేయలేదు..రాష్ట్రానికి కూడా ఏం చేయకపోతే ఓట్లే అడిగే హక్కు ఎక్కడిదన్నారు. రాముడి గురించి మాట్లాడే బండి సంజయ్ అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట రామయాలనికి బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడగడం కాదు, ఇల్లందకుంట రామాలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో జవాబు చెప్పిన తరువాతనే ఓట్లు అడగాలన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని, మాకు ఓట్లు అడిగే అర్హత ఉందన్నారు. 5 సంవత్సరాలు తాను ఎంపిగా చేసి జిల్లాలో ఎన్నో అభివృద్ది పనులు చేశానని, వినోద్‌కుమార్, బండి సంజయ్ ఎంపిగా ఉండి ఏమి చేశారో తెలుపాలన్నారు. బీజేపీ నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు మీ ఖాతాలో వేస్తామని ఎందుకు వేయలేదో, 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించాలన్నారు.
వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి శూన్యం…
వినోద్‌కుమార్ కథ అయిపోయిందని, కేవలం తన స్వార్థం కోసం జాతీయ రహదారిని ప్రతిమ ఆసుపత్రి మీదుగా వెళ్ళేటట్లు చేసుకున్నాడని మండిపడ్డారు. ఉద్యమంలో ఉండి కూడా తాను ఎన్నో పనులు చేశానని, అందులో జమ్మికుంట బ్రిడ్జి, జగిత్యాల హైవే రోడ్డు, కరీంనగర్ జిల్లాలో పాస్ప్పోర్ట్ కార్యాలయం, హుజూరాబాద్‌లో హాస్పిటల్ తన హయాంలోనే మంజూరు అయ్యాయని తెలిపారు
కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి..
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిల పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో 300లకుపైగా పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, గత ఎన్నికల్లో 18 పోలింగ్ బూత్ లలో మాత్రమే మెజారిటీ వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో బూత్‌లలో మెజారిటీ తెచ్చుకున్న నాయకులకే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చామని, 500 కే గ్యాస్ అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ప్రారంభించామని తెలిపారు. తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు పథకంతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు కడుతామన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడానికి సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, వచ్చే వర్షాకాలపు పంటకు రైతులకు వరికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. 10 ఏళ్లలో కేసిఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేశాడని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. కాలేజీ ప్రెసిడెంట్‌గా, ఎన్‌ఎస్యుఐ అధ్యక్షుడిగా, మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల ఆశయాలు నెరవేరుస్తున్నానని తెలిపారు. రాహుల్‌గాంధీ నఫరత్ చోడో… మొహబ్బత్ జోడో అని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశాడని, ప్రజాస్వామిక వాది రాహుల్‌గాంధీ అప్రజాస్వామిక వాది, ఓ నియంత మోడీకి జరుగుతున్న పోరాటమన్నారు. తాను రామ భక్తుడినని ఇల్లందకుంట రామాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నానని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజురాబాద్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జీలు వోడితెల ప్రణవ్, పురమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.