బాహు బలంన్యూస్ హుజూరాబాద్,సెప్టెంబర్ 20:
పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి, ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న ప్రపంచ శుభ్రత దినోత్సవాన్ని (వరల్డ్ క్లీనప్ డే) పురస్కరించుకుని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘మన ఊరు – మన బాధ్యత’ అనే నినాదంతో ప్రతి పౌరుడూ తమ ఇల్లు, వీధి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో వచ్చే చిన్న మార్పే రేపటి పెద్ద విజయానికి నాంది పలుకుతుందని అన్నారు. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా నిర్దేశిత డబ్బాల్లోనే వేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పునర్వినియోగ (రీసైక్లింగ్) పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు.
భూమాతను కాపాడుకునేందుకు విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా శుభ్రత ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ‘చిన్న చర్య… పెద్ద మార్పు… మన చేతుల్లోనే!’ అనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు.










