బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఏప్రిల్ 1:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి సరిహద్దు వద్ద, జనావాసాల మధ్య ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ప్రాజెక్టుపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై స్థానిక ప్రజలు, విద్యార్థులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత పది రోజులుగా అఖిల పక్షం, వివిధ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతుగా బుధవారం హుజురాబాద్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది.
కిలోమీటరు మేర మానవహారం.. విద్యార్థుల గళం.
డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. సుమారు అర కిలోమీటరు పొడవునా విద్యార్థులు రహదారిపై నిలబడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే జల, వాయు కాలుష్యం పెరిగి ప్రాణకోటికి, వ్యవసాయ రంగానికి తీరని నష్టం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు వాహనాలు బారులు తీరాయి. ఆందోళనకారులకు ప్రయాణికులు సైతం సంఘీభావం తెలపడం గమనార్హం.
కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోరా?
ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెంటాల సుహాసిని పాల్గొని మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు. తాము అధికార పార్టీకి చెందిన వారమైనప్పటికీ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉద్యమంలో భాగస్వాములవుతున్నామని స్పష్టం చేశారు. సిర్సపల్లి సరిహద్దులో జనావాసాల మధ్య దీనిని ఏర్పాటు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: పోలాడి రామారావు.
రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “మేము డంపింగ్ యార్డుకు వ్యతిరేకం కాదు, కానీ జనావాసాల మధ్య దానిని ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ఊరికి దూరంగా దీనిని తరలించాలి” అని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేలాదిగా పోస్ట్ కార్డులు పంపామని, ప్రభుత్వం స్పందించకుంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు
రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగనున్న గ్రామ సభల్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. సింగాపూర్, మాందాటిపేట్ గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ పోరాటంలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్ రావు, బండ సింధూజ, సర్పంచ్ పోల్సాని రామారావు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ గౌరు కరుణాకర్ రెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, రైతు సంఘాల నేతలు గూడూరి స్వామి రెడ్డి, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మల్లా రెడ్డి, జయపాల్ రెడ్డి, సమ్మయ్య, మూగల రాజిరెడ్డి, ముచ్చా సమ్మిరెడ్డి, విష్ణుదాస్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.












