బాహు బలంన్యూస్ హైదరాబాద్: జూలై 6 .మొన్న గుజరాత్, నేడు తెలంగాణ. కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలులో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల పనిగంటలను రోజుకు 10 గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జులై 9న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్న కార్మిక లోకానికి ఇది మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
దొడ్డిదారిన మోడీ సర్కార్ లేబర్ కోడ్‌ల అమలు
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను దొడ్డిదారిన అమలు చేయడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాలు రోజుకు 10 గంటల పనిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. పార్టీలు వేరైనా, పాలకుల ఆలోచనలు ఒక్కటేనని చెప్పడానికి ఇది నిదర్శనమని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రపంచ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని, మేడే స్ఫూర్తి, మానవత్వ విలువలను ప్రభుత్వాలు మంటగలుపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కార్పొరేట్ల కోసం కార్మికుల శ్రమ పణంగా
కష్టజీవుల శ్రమను కరెన్సీగా మార్చుకోవడానికి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మోడీ సర్కార్ బాటలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా పయనిస్తోందని బహుబలం న్యూస్ బ్యూరో చీప్ వేల్లడించింది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే చాలంటూ ప్రపంచదేశాల్లో పర్యటిస్తున్న ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ల కోసం కార్మికుల శ్రమను పణంగా పెడుతున్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే కార్మికులకు కనీస భద్రత, కనీస వేతనాలు, సెలవులు వంటి అనేక అంశాలను కోల్పోవాల్సి వస్తుందని జాతీయ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడాన్ని ఆ సంఘాలన్నీ తప్పుపడుతున్నాయి. శ్రమదోపిడీకి “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంటూ పాలకులు ముద్దుపేరు పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూ-టర్న్ తీసుకున్న కార్మిక మంత్రి
రాష్ట్రంలో 10 గంటల పనివిధానాన్ని అమలు చేస్తారా అని ఇటీవల విలేకరుల సమావేశంలో బహుబలం న్యూస్’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. వారం తిరక్కుండానే 10 గంటల పని విధానంపై ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ కూడా పాల్గొంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుత చట్టాలు, నష్టాలు
ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం ఒక కార్మికుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేయాలి. వారానికి 48 గంటలకు మించకూడదు. అయితే ఈ 8 గంటల పనిని కూడా తగ్గించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రతిపాదన చేసింది. 8 గంటల పనివల్ల కార్మికులు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల పనిగంటలు తగ్గించాలని సూచించింది.
ఉపాధికి దెబ్బ
ఇప్పటివరకు 24 గంటలు పనిచేసే సంస్థల్లో మూడు షిఫ్టుల పనివిధానం అమల్లో ఉంది. ఇప్పుడు కంపెనీలు ఈ విధానానికి స్వస్తి చెప్పి, అవే వేతనాలతో రెండు షిఫ్టుల్లో పనిచేయించుకుంటాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల పరిశ్రమల్లో ఒక షిఫ్ట్ కార్మికులకు పనిలేకుండా పోయి, ఆయా కుటుంబాలు వీధిన పడతాయని, దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు చేయాల్సిన పనిని ఇద్దరితోనే చేయించుకుంటూ పరిశ్రమలు ఒకరి జీతాలు మిగుల్చుకుంటున్నాయని, ఇలాంటి వాటిపై కార్మిక శాఖ మొద్దునిద్ర పోతోందని విమర్శించారు.
కార్పొరేట్ల వాదన, కార్మిక సంఘాల ఆగ్రహం
ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, ఎల్‌అండ్‌టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం లాంటి వారు వారానికి 70 నుంచి 90 గంటల పని దినం ఉండేలా కార్మికుల చట్టాలు మార్పులు చేయాలని బహిరంగంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. పనిగంటలు పెరిగితే కార్మికుల్లో సృజనాత్మకత పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమైనా, పాలకులు పనిగంటలు పెంచేందుకే మొగ్గుచూపారు.
అత్యంత ప్రమాదం: పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, 10 గంటల పనివిధానం అంటే కార్మికుల శ్రమను మరింత దోచుకోవడమేనని అన్నారు. మోడీ బాటలోనే రేవంత్‌రెడ్డి సర్కార్ నడుస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్‌లు వద్దని పోరాటాలు చేస్తుంటే కార్మిక చట్టాలను సవరిస్తూ, సరళీకరిస్తున్నారని, కేవలం కార్పొరేట్లకు మరిన్ని లాభాలు తెచ్చిపెట్టడం కోసమే ఈ తాపత్రయమని ఆయన ఆరోపించారు. దీనివల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బేషరతు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.
కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో 10 గంటల పనివిధానానికి ఇటీవల జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర కార్మిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పనివేళల పరిమితిని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారంలో 48 గంటల పని దాటితే ఓవర్ టైం (ఓటీ) వేతనం చెల్లించాలని తెలిపారు. కార్మికులు ఆరు గంటలు పనిచేశాక కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువసేపు పని చేయించరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో భాగంగా పనివేళలు సవరించామని కార్మిక శాఖ పేర్కొంది.










