బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 20: హుజూరాబాద్ పట్టణంలోని కుమ్మరి వాడ అంగన్‌వాడీ సెంటర్ టీచర్ గన్నారపు సంధ్య (33) అనారోగ్యంతో కన్నుమూయడం పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మృతికి హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని భర్త రవీందర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
సంఘటనకు సంబంధించి బాధితురాలి భర్త రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం, సంధ్య కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. అయితే, ఆపరేషన్ చేసిన వైద్యుడు తమ వద్ద సరైన పరికరాలు లేవని చెప్పి మరో ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. దీంతో వేరే ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా సరైన వైద్యం అందలేదు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు సంధ్య బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించి చికిత్స అందించడానికి నిరాకరించారు. నిన్నటి నుండి మృత్యువుతో పోరాడిన సంధ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు.
భార్య మృతికి హనుమకొండలోని ఆపరేషన్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని భర్త రవీందర్ కన్నీటి పర్యంతమయ్యారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవీందర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంధ్య ఆకస్మిక మృతితో వారి కుటుంబంలో తీరని శోకం నెలకొంది.
ఈ విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్ సిడిపిఓ మరాటి
సుగుణ, అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంధ్య మృతి పట్ల వారు సంతాపం తెలిపారు.
ఈ ఘటనపై రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సంధ్య మృతి చెందిందని ఆరోపిస్తూ ఆయన న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
