మినరల్ వాటర్ ప్లాంట్ కు సోలార్ విద్యుత్తు ఏర్పాటు…. సోలార్ విద్యుత్తును ప్రారంభించిన కిట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్ “ఉన్నత్ భారత్ అభియాన్” పథకం కింద కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు..

బాహుబలం న్యూస్ హుజురాబాద్,ప్రతినిధి: ఏప్రిల్ 2: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ కనెక్షన్ ను కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్.. కిట్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి శంకర్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఉన్నత్ భారత్ అభియాన్” కార్యక్రమం కింద సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి కిట్స్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం పంపిన ప్రతిపాదనల మేరకు రూ. లక్ష మంజూరయ్యాయి. సోలార్ విద్యుత్ ప్రారంభం అనంతరం కిట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్ మాట్లాడుతూ.. సింగాపురం గ్రామంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ కు సోలార్ విద్యుత్ ను అందించడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామంలోని సింగాపురం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి యూనిట్ల ద్వారా శ్రమదానం, అక్షరాస్యత, సామాజిక సమస్యలపై గ్రామస్తులకు అవగాహన పంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. సింగాపురం గ్రామ అభివృద్ధిలో తమ కళాశాల ఎప్పుడు ముందుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం అందించడం మంచి పరిణామమని అన్నారు. ఇందుకు కృషి చేసిన కిట్స్ ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సోలార్ ప్లాంటు ఏర్పాటు ద్వారా వాటర్ ప్లాంట్ కు విద్యుత్ భారం తగ్గుతుందని అన్నారు. భవిష్యత్తులో సోలార్ ద్వారా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ఈ విషయమై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రస్తుత కాలంలో సోలార్ విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని అన్నారు. గ్రామాల్లోనూ నివాస గృహాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిందని అన్నారు. చిన్న కుటీర పరిశ్రమలు కూడా సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని అన్నారు. హైడల్, థర్మల్ విద్యుత్ కు సోలార్ విద్యుత్ ప్రత్యామ్నాయం అవుతోందని, ప్రభుత్వాలు కూడా సోలార్ విద్యుత్ ను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కందుకూరి శంకర్, ఎలక్ట్రికల్ విభాగ అధిపతి యోగేష్ పుండాలిక్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్, డా. ఏ కొమురయ్య, ఎం రాకేష్, విద్యార్థులు అభినాష్, సైనికి, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ప్రభాకర్, రాజ్ కుమార్, ప్రశాంత్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !