#సభలు_నిర్వచనాలు
…….
{1} #ముఖ్య_అతిథి: సభ ప్రారంభ సమయానికి గంట, ఆ పైన ఆలస్యంగా, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. వచ్చే ముందు నిర్వాహకులకు ఫోన్ వస్తుంది. వారిని గేటు దగ్గర సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకు రావాల్సి ఉంటుంది. వారు రాగానే, వేదిక మీద జరుగుతున్న ఏ సాంస్కృతిక కార్యక్రమాన్నైనా ఆపి, వారిని వేదిక మీదకు ఆహ్వానించాలి. తరువాత, వారు ఎంత సేపైనా మాట్లాడవచ్చు. వారు మాట్లాడి అలసిపోతే, మంచినీళ్ళ బాటిల్ అందించాలి. తర్వాత వారు ఎప్పుడైనా వెళ్ళి పోవచ్చు. వారు ఏదో కుంటి సాకులు చెబితే, ఇబ్బందిగా ముఖం పెట్టి, గంగిరెద్దులా తలాడించాలి. తరువాత వారికి తగిన రీతిగా సన్మానం చేసి, కారు వరకూ దిగబెట్టి రావాలి.
{2} #సభాధ్యక్షులు: వీరికి అపారమైన వాక్పటిమ ఉంటుంది. ముఖ్య అతిథిని, సభా నిర్వాహకులను సంబాళించుకుంటూ పోవాలి. ముఖ్య అతిథిని ‘ఇంద్రుడూ, చంద్రుడూ’ అంటూ మాటి మాటికీ పొగడగలిగి ఉండాలి. ఎక్కడైనా డోస్ తక్కువైనట్టనిపిస్తే, ధీరగంభీరంగా ముఖ్య అతిథికి కూడా తెలియని సుగుణాలనూ గుప్పించగలగాలి. వేదిక మీద సెంటర్ సీట్ మాత్రం ఇతనిదే. ప్రతీ ఫోటోలో తను తప్పక పడాలి. దాని కోసం వింత వింత రంగుల్లో వేషధారణ ఉండాలి.
{3}#విశిష్ట_అతిథులు: వీరు కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళయి ఉంటారు. పాపం! సభలకు ఎవరు పిలుస్తారా అని వేచి చూస్తుంటారు. సభ ప్రారంభానికి ముందే వస్తారు. ప్రేక్షకులను పలకరిస్తూ, తమ ఉనికిని తెలియ చేస్తుంటారు. వీరి దగ్గరకొచ్చే సరికి, వీరేమో రెండు రోజులు కూర్చుని, సభకు సంబంధించిన అంశం మీద ఐదారు పేజీలు రాసుకుని వస్తారు కానీ, సభాధ్యక్షుల వారు నిర్దాక్షిణ్యంగా, ‘ ఇప్పటికే కాలీతీతమైంది కాబట్టి ఐదు నిముషాలలో ముగించాలి.’ అని హుకుం జారీ చేస్తారు. ఎందుకంటే, వాళ్ళంతా సభాధ్యక్షుల వారికి కావలసిన వారు. సభానంతర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన వారు కాబట్టి, సర్దుకుపోతుంటారు.
{4} #ఆత్మీయ_అతిథులు: వీరిని కేవలం ఆహ్వాన పత్రం నిండుగా నింపడానికి పిలుస్తారు. వీరొచ్చినా రాకపోయినా ఫర్వాలేదు. ఒక వేళ వచ్చినా, మాట్లాడడానికి ముందు, సభాధ్యక్షుల వారు ‘క్లుప్త సందేశం ఒక్క నిముషంలో ముగించాలి’ అని హుకుం జారీ చేసి, అర నిముషానికి మైకు లాగేసినా వీళ్ళు పెద్దగా బాధ పడరు. వారు ఆహ్వాన పత్రంలో పేరు చూసుకుని మురిసిపోతారు. ఫేస్బుక్కులో పది రోజుల ముందు నుండీ ఆహ్వాన పత్రం పోస్ట్ చేసి, తమ పేరు చుట్టూ ఒక గుండ్రం గీసి హైలైట్ చేసుకుని, అభినందనలు స్వీకరిస్తుంటారు. ఫంక్షను దగ్గర పడ్డ కొద్దీ ‘ఎల్లుండే’; ‘రేపే’; ‘నేడే’ అని మనను ఊరిస్తుంటారు.
{5}#సన్మాన_గ్రహీతలు: వీళ్ళు సాధారణంగా ఆస్థాన సన్మాన గ్రహీతలయి ఉంటారు. పాపం వీరు నెల్లూరు, అనంతపురం, బెంగుళూరు, వైజాగ్ వంటి బహు దూరాల నుండి వచ్చి సన్మానం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. యాభై మంది ప్రేక్షకులు ఉంటే అందులో నలభై మంది సన్మాన గ్రహీతలే ఉంటారు. మిగిలిన పది మంది సభా నిర్వాహకుల తాలూకే. ఇందులో మహిళా/కవయిత్రులు కూడా ఎక్కువే. సభా కార్యక్రమం రాత్రి పది దాటితే పాపం వీళ్ళకు ఇళ్ళకు వెళ్ళడం కష్టమవుతుంది. ‘కాస్త తొందరగా సన్మానం చేసి మమ్మల్ని పంపించమంటే’ సభాధ్యక్షుల వారు తీవ్రంగా అరుస్తారు. ‘మీకు ఓపిక ఉండాలి. సహనం లేకపోతే వెళ్ళిపోండి. ఇంకోసారి పిలవను.’ అని గదమాయిస్తాడు. ఓ చెక్క ముక్క మొమెంటో, ఓ యాభై అరవై రూపాయల శాలువా, ఓ ఫోటో కోసం వాళ్ళు పడే అవస్థలు వర్ణనాతీతం. చిట్టచివరకు, తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో భక్తులను నెట్టివేసినట్టు, సన్మాన గ్రహీతలను, శాలువా కప్పి, ఓ ఫోటో తీయగానే తోసేస్తుంటారు. వీటి కోసం కూడా కొంత మంది యాంకర్ల దగ్గరకు వెళ్ళి, ‘మా పేరు కొంచెం ముందు పిలవమని’ పైరవీలు చేస్తుంటారు. కొందరు గొడవలు పెట్టుకుంటారు. అటువంటి వారి పై కక్షగట్టి, యాంకర్లు, వరుసలో పిలవకుండా చివరి వరకు ఆపుతారు.
{6} #జాతీయ_అంతర్జాతీయ_జీవన_సాఫల్య_పురస్కార_గ్రహీతలు:
పాపం వీరైతే ఈ అవార్డుతో తమ జన్మ ధన్యమవుతుందనీ, తమకు అంగరంగ వైభోగంగా సన్మానం జరుగుతుందని, బంధు మిత్ర సహేతంగా వస్తారు. కానీ, అక్కడ వారిని పట్టించుకునే వారు కూడా ఉండరు. వేదిక మీద కూర్చోబెట్టరు. వారికి పెద్ద ఘనమైన సన్మానమేమీ ఉండదు. ఆహ్వాన పత్రిక ప్రింటు కాక ముందు తమ ఒక్కరికే జీవన సాఫల్య పురస్కారాన్ని ఇస్తారని వీరు అనుకుంటారు. కానీ, ఆరు పేజీల ఆహ్వాన పత్రికలో తన పేరు అరవయ్యో సీరియల్ నెంబరు దగ్గర కనిపించే సరికి నివ్వెరపోతారు. వారికి కూడా అదే చెక్క ముక్క గానీ కొంచెం పెద్దది, వీలైతే ఒక టోపీ పెట్టి పంపిస్తారు. పర్సులూ, గిర్సులూ ఆశించి వందల మైళ్ళ నుంచి వచ్చిన వారికి దారి ఖర్చులు తప్ప మిగిలేదేముండదు.
{7}#నిర్వాహకులు: కార్యక్రమం ఆలస్యమవుతున్న కొద్దీ, ముఖ్య అతిథి రాకపోయేసరికి బెంబేలు ఎత్తి పోతుంటారు. అనవసరంగా ఈ కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకున్నానని పదేపదే తలబాదుకుంటుంటారు. ‘అవి లేవనీ, ఇవి లేవనీ’ అడిగేవారికి సమాధానాలు చెప్పలేక సతమతమవుతుంటారు. తనను ఇందులోకి దించిన వారి మీద మనసులోనే తిట్టుకుంటారు. ‘స్నాక్స్ అందలేదని, తనకు ఇచ్చిన మొమెంటో మీద వేరే వారి పేరు ఉందని, ఇంత రాత్రైతే లేడీస్ ఇంటికి ఎలా వెళ్తారనీ, మేం పరాయి ఊరు నుంచి వచ్చాం, మమ్మల్ని తొందరగా పంపించండి’ అనే ప్రశ్నలకు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఒక పక్కన ‘సభానంతర కార్యక్రమాల ఏర్పాట్లు జరుగుతున్నాయా?’ అని అతిథులు, సభాధ్యక్షుల వారు కోడ్ భాషలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెర్రి ముఖం వేసుకోకుండా తప్పదు.
{8}#పేపరు_విలేఖర్లు: సభ జరుగుతున్నప్పుడే కొంత మంది పేపర్ విలేఖరులమని, మీడియా నుండి అని హడావుడి చేస్తుంటారు. వీళ్ళ పేపర్లను, ఛానెళ్ళను జన్మలో చూసి ఉండము కానీ, సభ తర్వాత వీరు నిర్వాహకులను పీడించే విధానం వీర లెవెల్లో ఉంటది.
ఇది కేవలం హాస్యం కోసం రాసింది. ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. కొన్ని నా పుస్తకావిష్కరణ సభల్లో అనుభవించినవి. చాలా వరకు నేను గమనించినవి. చాలా వరకు నిజాలే. అందుకే నేను సభలు ఏర్పాటు చేయడం, సభలకు పోవడం మానేసాను.
ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు, అతిథులుగా ఉన్నప్పుడు, మనం అతిథులుగా అస్సలు వెళ్ళకూడదు. వారు చెప్పే నీతి సూత్రాలూ, అభూత కల్పనలు, విని మనం తట్టుకోలేము. వారిని చూసిన ఆనందంలో నిర్వాహకులు ఉబ్బి తబ్బిబ్బయి మనను దాదాపుగా వేదిక మీద నుండి నెట్టేస్తారు.
{9}#శాలువాలు_టోపీలు_మొమెంటోల_దుకాణాలు
వీరి వ్యాపారం నిత్యకళ్యాణం, పచ్చ తోరణం. ఫంక్షను హాలు పక్కనే ఉంటాయి.
మీరు కూడా మీ అనుభవాలు పంచుకోవచ్చు.
సాహిత్య కార్యక్రమాలకు ప్రేక్షకులు దొరకడం లేదు. ఏం చేయమంటారు మరి?