ప్రియమైన వైద్యులారా,
సాయిబాబా కళ్ళను తీసేప్పుడు
కొంచెం మృదుత్వాన్ని జోడించండి
వాటిల్లో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలు మరొకరిలో విప్పారవచ్చునేమో
ఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికి తీయండి
మనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలో
చావును నిరాకరించిన ఆ ఉక్కునరాల గుండెలోతుల్లో,
ఆదివాసుల పట్లా, పీడిత,తాడిత ప్రజానీకం పట్లా
అంతటి సున్నితత్వపు మూలాలు దొరకవచ్చు
నిత్య నిర్బంధంలో, నొటొక్క జబ్బులతో పెనుగులాడుతూ విశ్వాసాల కోసం నిలబడడం అంటే ఏమిటో చెప్పేందుకు
పూటకో సిద్దాంతం ప్రవచించే
ఊసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపై
ఆ పోలియోకాళ్ళతో జాడించేందుకేమైనా అవకాశముందేమో చూడండి
మరొక్క, చివరి విన్నపం…
ఆ మెదడును మాత్రం
రేపటి తరాలకోసం, మరింత జాగ్రత్తగా భద్రపరచండి
తొంభై శాతం పైగా వికలాంగుడైనా,
అతని “ఆలోచించే మెదడు” ప్రమాదానికి వణికిన
ఈ దోపిడీవ్యవస్థ బలహీన లంకె (వీక్ లింక్) ను
బహుశా, ఎవరైనా పసిగట్టవచ్చు
(కామ్రేడ్ జీ.ఎన్. సాయిబాబా ఆకస్మిక అమరత్వానికి బాధాతప్త హృదయంతో…)