విప్లవ చైతన్య కెరటం విజయ్ కుమార్ . నేడు విజయ్ కుమార్ 10 వ వర్ధంతి.)

బాహుబలం టీవీ న్యూస్ అక్టోబర్ 11: హుజురాబాద్
ఆయన జీవితం అనేక రకాల తుఫాన్ల ను తట్టుకుని ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, అప్పటికప్పుడే లేచి నిటారుగా నిలబడి ముందుకే సాగింది తప్ప ఎన్నడూ వెనుకడుగు వేయలేదు.
ఆయన విద్యార్థి దశ నుండే అణచివేతకు, అన్యాయాలకు,దోపిడీకి,వివక్షలకు గురౌతున్న ప్రజల పక్షాన నిలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు విప్లవ సాహిత్య చైతన్యాన్ని,తద్వారా విప్లవ రాజకీయాల వెళుతురులను ప్రసరింప చేసిన వారిలో ఒకడు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలంగా వెనక్కిలాగినా,మొక్కవోని ధైర్యంతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే,సామాజిక స్పృహతో ముందుకు సాగిన వ్యక్తిత్వం ఆయనది.
శ్రీకాకుళ సాయుధపోరాట వెలుతురులో,1970 లో పురుడుపోసుకున్న విప్లవరచయితల సంఘం ప్రేరణతో ఆయన ప్రయాణం మరింత వేగంగా కొనసాగింది.
పుట్టెడు కష్టాలు ఎదురైనప్పటికీ ఆయన ముఖంలో ఎల్లవేళలా కనిపించే చిరునవ్వు తనలాంటి వారికి ఎందరికో బాసటగా నిలిచింది.
“ఉత్తర తెలంగాణ మిత్రులను చూస్తే దిగ్భ్రమగా ఉంటుంది.వారి ముఖాల్లో చిరు నవ్వుతో పాటు,మాటల్లో స్వచ్ఛమైన వెన్నెల్ని పోగేసి మంటల్ని రాజేస్తుంటారు”అని ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు,ప్రముఖ కవి కె.శ్రీనివాస్ కొమురంభీం నవలా సహా రచయిత సాహు(శనిగరం వెంకటేశ్వర్లు) గురించి రాస్తూ అన్న మాటలు అక్షరాల ఈయనకు కూడా వర్థిస్తాయి.
ఆయనే కరీంనగర్ కు చెందిన భాగ్యనగర్ విజయకుమార్…
విజయ్ కుమార్ కరీంనగర్ కేంద్రంగా యువసాహితి,కరీంనగర్ సాహితి మిత్రమండలి, ఉద్యమ సాహితి లాంటి సాహిత్య సంస్థల వ్యవవస్థాపకులుగా, పలు పుస్తకాల ప్రచురణ కర్తగా,విద్యుల్లత, జీవగడ్డ పత్రికల సంపాదకులుగా పనిచేసిన బి.విజయ్ కుమార్ గురించిన పరిచయం, పత్రికలతో, సాహిత్యంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న వారికి పరిచయం అక్కరలేదు…
భాగ్యనగర్ విజయ్ కుమార్ అమరుడై నేటికి దశాబ్దా కాలం కావస్తుంది.
ఆయన 11 ఆక్టోబర్ 2014 రోజున పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ అంతిమశ్వాసను విడిచారు.
భాగ్యనగర్ విజయ్ కుమార్ గురించి ఈ సందర్బంగా స్మరించుకోడమే కాదు,ఆయన ఆశయ సాధనలో మనం నిర్వహిస్తున్న భూమికను గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ రెండుమాటలు…
విప్లవ రచయిత వరవరరావు అన్నట్టుగా “భాగ్యం” విజయ్ కుమార్ ఇంటిపేరుకే పరిమితమైంది,నిజానికి ఆయన భాగ్యవంతుల కుటుంబంలో జన్మించలేదు.
అలాంటి భాగ్యనగర్ విజయ్ కుమార్1970 లో ఒకరోజు “విద్యుల్లత” మాసపత్రికలు భుజానికి వేసుకున్న సంచిలో పెట్టుకుని, నన్ను,నరెడ్ల శ్రీనివాస్ ను హుజురాబాద్ లో కలిసాడు.అప్పుడు నేను,శ్రీనివాస్ ఇంటర్మీడియెట్ విద్యార్థులం.విజయ్ కుమార్ జమ్మికుంట లోని ఆదర్శ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి.చదువుతున్నడు.
ఆయన తనకు తాను పరిచయం చేసుకుని, పది విద్యుల్లత మాస పత్రికలను మాకందించి,మీరు చదవండి,ఉపాధ్యాయులతో పాటు,తోటి విద్యార్థులతో కూడా చదివించండి… మళ్ళీకలుద్దాం అంటూ వెళ్ళిపోయాడు.
1970 లో విజయ్ కుమార్ మాకు అందించిన స్నేహహస్తాన్ని శ్రీనివాస్,నేను ఎన్నడూ వదలలేదు,అలాగే ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు వదిలించుకోలేదు.
విద్యుల్లత పత్రికలు మా చేతికి చేరకముందే,మాకు ఉపాధ్యాయులుగా పనిచేసిన ఆకుల లింగయ్య ద్వారా మహాకవి శ్రీశ్రీ గారి”మహాప్రస్థానం”,ఆ వెంటనే వరవరరావు సంపాదకత్వంలో వెలువడిన “సృజన”మాస పత్రికలు అందడటం వల్ల విద్యుల్లత పత్రికను అర్థం చేసుకోవడానికి మాకు ఎక్కువ సమయంపట్టలేదు…కానీ,సృజన పత్రిక సంపాదకులు వరవరరావు, జమ్మికుంట డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసుస్తూనే,అదే కళాశాల విద్యార్థి విజయ్ కుమార్ సంపాదకత్వంలో వెలువడిన విద్యుల్లత పత్రికకు వెన్నెముకగా పనిచేసిన డాక్టర్ ఎం.వి.తిరుపతయ్య,హుజురాబాద్ ఉన్నత పాఠశాలలో మాకు విద్యాబోధన చేసిన ఆకుల లింగయ్య లు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఒకే బ్యాచ్ (1957-60) విద్యార్థులేనని,అలాగే వరంగల్ కేంద్రంగా సాహిత్య చైతన్య స్ఫూర్తిని రగిలించిన”మిత్రమండలి”సభ్యులేనన్న విషయం చాలా కాలం దాకా మాకు తెలియదు.అలాగే,1970 నాటికే బి.విజయ్ కుమార్ “సృజన” కుటుంబంలో సభ్యుడన్న విషయం కూడా మాకు తెలియదు.విజయ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతాల్లోని అనేక మంది మాలాంటి వారికి కూడా తన స్నేహాహస్తాన్ని అందించి వున్నాడన్న సంగతి కూడా మాకు అనంతర కాలంలోనే తెలిసింది.మా గురువు ఆకుల లింగయ్య ద్వారానే విజయ్ కుమార్ మాకు పరిచయమైండు అన్నది వాస్తవం.
విద్యుల్లత పత్రికను తనమిత్రులు గోపు లింగారెడ్డి,ఉమ్మెంతల వెంకట రెడ్డి ల సమన్వయంతో”కరీంనగర్ సాహితీ మిత్రమండలి” పేరుతో నడిపించినప్పటికి, ఈ పత్రిక చోధశక్తిగా జమ్మికుంట ఆదర్శ డిగ్రీకళాశాల తెలుగు లెక్చరర్ డాక్టర్ ఎం.వి.తిరుపతయ్య నిలిచాడు. అలాగే జమ్మికుంట కు సమీపంలోని మడిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అండ కూడా విజయ్ కుమార్ కు ఉండేది.తిరుపతి,విజయ్ కుమార్ లు ఇద్దరు జమ్మికుంట డిగ్రీ కళాశాలలో సహవిద్యార్థులు. తెలుగు లెక్చరర్ తిరుపతయ్యకు వీరు ఇద్దరు ప్రియమైన శిష్యులు. మడిపల్లి తిరుపతి ఆ రోజుల్లో సామాజిక స్పృహతో కథలు, కవితలు లెక్చరర్ తిరుపతయ్య పర్యవేక్షణలో రాసేవాడు.
విజయ్ కుమార్ సంపాదకత్వంలో వెలువడిన విద్యుల్లత మాస పత్రికలో ముప్పాళ్ల నరసింహారావు, ఎం.వి.తిరుపతయ్య,అంపశయ్య నవీన్,తాడిగిరి పోతరాజు,ఉమ్మెంతల వెంకటరెడ్డి,మడిపల్లి తిరుపతి వంటి కథా రచయితలు,వేగుంట మోహన ప్రసాద్,ఎన్. కే, దినకర్, విద్యార్థి,వరవరరావు, టంకశాల అశోక్,అద్దేపల్లి రామ్మోహన్ రావు,నల్ల మల్లారెడ్డి, కిషన్, సి.వి,గోపులింగారెడ్డి వంటి కవులు, అట్లూరి రంగారావు, జగన్మోహన్, త్రిపురనేని మధుసూదన్ రావు,పాములపర్తి సదాశివరావు లాంటి విమర్శకులు చేసిన పదునైన సాహిత్య విమర్శలు విద్యుల్లత పత్రికలో చోటుకునేటివి.
అప్పటికే వరవరరావు సంపాదకత్వంలో వెలువడిన “సృజన” మాస పత్రిక కుటుంబ సభ్యులుగా ఉన్న డాక్టర్ ఎం.వి.తిరుపతయ్య, ఆకుల లింగయ్య,భాగ్యనగర్ విజయకుమార్ లు విప్లవ సాహిత్య బీజాలను వరంగల్ నుండి కరీంనగర్ కు మోసుకువచ్చి పునాదివేశారు.అవి ఆనాటి ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు విస్తరించబడ్డాయి.
విప్లవ రచయితల సంఘం మార్గదర్శకత్వంలో విద్యుల్లత మాసపత్రిక ఆనాటి యువతరాన్ని ప్రజాస్వామిక దృక్పధం వైపు నడిపింది. విద్యుల్లత ఆరోజుల్లో సృష్టించిన ప్రభంజనం తో అప్పటివరకు “భాగ్యనగర్” విజయ్ కుమార్ గా ఉన్న ఆయన “విద్యుల్లత” విజయ్ కుమార్ గా రూపొందిండు.
విద్యుల్లత పత్రిక ఆగిపోయిన తర్వాత కరీంనగర్ కేంద్రంగా మిత్ర బృందంతో కలసి “ఉద్యమ సాహితి”పేరుతో ఒక సాహిత్య సంస్థ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడింది.ఉద్యమసాహితి సంస్థ అనేక ప్రచురణలను వెలుగులోకి తీసుకువచ్చింది.ఇందులో ముఖ్యమైనవి “బద్ లా” కథా సంకలనం,ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం పై ఎంజీలో కాత్రోచి రాసిన” బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ కు మహాకవి శ్రీశ్రీ చేసిన అనువాద కవిత్వం”రెక్కవిప్పిన రేవల్యూషన్”,వరవరరావు మూడో కవితా సంపుటి”ఊరేగింపు”.
వరంగల్ నుండి వరవరరావు సారధ్యంలో వెలువడిన “సృజన”,కరీంనగర్ నుండి బి.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెలువడిన ” విద్యుల్లత” పత్రికల ప్రేరణతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆనాటి యువతరం అనేక సాహిత్య సంస్థలను ఏర్పాటు చేసి సాహిత్యోద్యమాన్ని ఉర్రూతలూగించింది.అందులో భాగంగానే హుజురాబాద్ కేంద్రంగా నరెడ్ల శ్రీనివాస్,ఆవునూరి సమ్మయ్య లు తమ మిత్ర బృందంతో కలసి 1973 లో “జనసాహితి” సాహిత్య సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
1975 లో దేశంలో ఎమెర్జెన్సీ ని ప్రకటించినప్పుడు కరీంనగర్ ఉద్యమసాహితి ప్రచురణలు “బద్ లా” కథల సంపుటి,రెక్కవిప్పిన రెవల్యూషన్ కవితా సంపుటితో పాటు,హుజురాబాద్ జనసాహతి ప్రచురించిన”నిప్పురవ్వలు” కవితా,కథ సంకలనాన్ని ప్రభుత్వం నిషేధించింది.
ఎమెర్జెన్సీ కాలంలో బి.విజయ్ కుమార్ తో పాటు రచయితలు ఎం.వి.తిరుపతయ్య, తాడిగిరి పోతరాజు లను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసింది.అరెస్ట్ కు ముందు విజయ్ కుమార్ అజ్ఞాతలోకి వెళ్లారు.అప్పుడు నేను ,శ్రీనివాస్ కూడా హైదరాబాద్ లో ఉన్నాం.అజ్ఞాతంలో ఉన్న విజయ్ కుమార్ మమ్మల్ని అనూహ్యంగా పబ్లిక్ గార్డెన్ లో కలసి,ఆ పక్కనే అసెంబ్లీ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రముఖ కవి నగ్నముని ని మాకు పరిచయం చేసి విజయ్ కుమార్ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
“బద్ లా” కథల సంకలనంలో ఎం.వి.తిరుపతయ్య,”న్యాయం”,”పునాది” పేరుతో రెండు కథలు రాయగా,తాడిగిరి పోతరాజు”నిప్పురవ్వలు”పుస్తకంలో
“మోదుగుపూలు”పేరుతో పెద్దకథ రాశారు.వీరి కథల మూలంగానే ఆ రెండు పుస్తకాలను నిషేధించి,రచయితలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
*నిర్మల ప్రింటిగ్ ప్రెస్ పై దాడులు*
**********************************
బి.విజయ్ కుమార్ దాదాపు ఒక దశాబ్దం పాటు విప్లవ రచయితల సంఘం సభ్యుడుగా కొనసాగారు.అప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్టు,లెనినిస్ట్)విప్లవోద్యమ కార్యాచరణ వరంగల్ నుండి కరీంనగర్ ను తాకుతున్న సందర్భం. ఎం.ఎల్.పార్టీనే తర్వాత కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్ గ్రూప్ గా మారింది.
విప్లవోద్యమ పార్టీ అగ్రనాయకత్వంలో ఉన్న కొండపల్లి సీతారామయ్య, కరీంనగర్ జిల్లాలో ఆపార్టీ నిర్మాణం,విస్తరణ కోసం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించిన డాక్టర్ కొల్లూరి చిరంజీవిని బాధ్యులుగానియమించింది.డా.చిరంజీవికి, విరసం బాధ్యుడుగా ఉన్న విజయకుమార్ ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ నిర్మాణం కోసం పూర్తిస్థాయి సహకారాన్ని అందించాడు.వీరిద్దరూ పార్టీ నిర్మాణంలో భాగస్వాములయిండ్లు.
ఆ రోజుల్లోనే పెద్దపల్లి కి చెందిన మల్లోఝుల కోటేశ్వరరావు(కిషన్ జీ),హుజురాబాద్ కు చెందిన నరెడ్ల శ్రీనివాస్ లు ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్.సి.డిగ్రీ చదువుతూ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న”ఉద్యమ”సాహితి లో కీలక బాధ్యతలు నిర్వహించగా,కరీంనగర్ జిల్లా కేంద్రంలో విప్లవ పార్టీ నిర్మాణంలోకి తొలుత ముద్దసాని కనుకయ్య,శంకర్, సంతోష్ కుమార్ లాంటి అనేక మంది యువకులు ముందుకు దూకారు.అలాగే,ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆనాటి యువతపై విప్లవ పార్టీ తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. డాక్టర్ కొల్లూరి చిరంజీవి,విజయ్ కుమార్ లు చాప కింది నీరులా అన్ని ప్రాంతాల్లో విప్లవ భావజాలాన్ని వెదజల్లారు.
ఫలితంగా హుజురాబాద్ జనసాహితి సభ్యులుగా ఉన్న సాహు(శనిగరం వెంకటేశ్వర్లు), నల్ల ఆదిరెడ్డి(శ్యామ్),తాడికొండ సుధాకర్ రెడ్డి,చంద్ర ప్రభాకర్,పల్లె కనకయ్య తదితరులు దేశంలో ఎమెర్జెన్సీ ని ప్రకటించడానికి ముందే 12 మే 1975 రోజున విప్లవోద్యమ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వీరంతా అప్పటికి జమ్మికుంట కాలేజీలో డిగ్రీ విద్యార్థులు కావడం విశేషం.జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల నుండి మరి కొందరు యువకులు,విద్యార్థులు ఎమెర్జెన్సీ ప్రకటించిన తర్వాత
అజ్ఞాతంలోకి వెళ్లారు.
విజయ్ కుమార్ తండ్రి భాగ్యనగర్ సత్యనారాయణ అప్పటికే కరీంనగర్ శాస్త్రీ రోడ్ లో విజయలక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ ను స్థాపించి నడుపుతున్నడు.విజయ్ కుమార్ ఆ ప్రెస్ లో తండ్రికి సహాయకారిగా పనిచేసిన అనుభవం ఉండటంతో,అదే రోడ్ లో విజయ్ కుమార్ స్వంతంగా “నిర్మల”ప్రింటింగ్ ప్రెస్ ను పెట్టి అనేక పుస్తకాలను ప్రచురించారు.శ్రీకాకుళం సాయుధపోరాటం లో నేలకొరిగిన పంచాది నిర్మల స్ఫూర్తిగానే విజయ్ కుమార్ ఆ ప్రింటింగ్ ప్రెస్ కు”నిర్మల”పేరును పెట్టాడు.
నిర్మల ప్రింటింగ్ ప్రెస్ లో పీపుల్స్ వార్ నక్సలైట్ల సాహిత్యం,కరపత్రాలు ముద్రిస్తున్నాడనే ఆరోపణలతో విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే విజయ్ కుమార్ తనకు 64 ఏళ్ల వయస్సులో పార్కిన్సన్ వ్యాధికి గురైనట్టుగా ప్రచారం జరిగింది.
*అందరి అడ్డా “జీవగడ్డ”*
**********************************
1985 జూన్ నెలలలో విద్యుల్లత విజయ్ కుమార్ “జీవగడ్డ”పేరుతో కరీంనగర్ కేంద్రంగా సాయంకాలం దినపత్రికను ప్రారంభించాడు.
కరీంనగర్ శాస్త్రి రోడ్ లోని శారదా ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయం జీవగడ్ పత్రిక కార్యాలయంగా మారింది.
శారదా ప్రింటింగ్ ప్రెస్ యజమాని బుడికే నాగభూషణం విజయ్ కుమార్ కు అండగా నిలిచి,జీవగడ్డ పత్రికను తన భుజాలపై వేసుకున్నాడు.
1986 లో జీవగడ్డ దినపత్రిక
మేనేజర్ గా నెల్లుట్ల వాసుదేవరావు జాయినయ్యాడు.వాసుదేవారావు, పత్రిక ప్రింటింగ్, సర్క్యులేషన్ తో పాటు,పత్రికకు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల నుండి ప్రకటలను సమీకరించే బాధ్యతల్లో కూడా ఉండేవాడు.
ఆ తర్వాత1987 లో కరీంనగర్”ఆంధ్రప్రభ”,”ఇండయన్ ఎక్స్ప్రెస్” దినపత్రికల స్టాప్ రిపోర్టర్ గా ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ జాయినయ్యాడు.సాహిత్యోద్యమం,జర్నలిస్ట్ ఉద్యమాలతో అంతకు ముందే అమర్,విజయ్ కుమార్ లు స్నేహితులు. ఈ స్నేహం వల్లనే “ఆంధ్రప్రభ” పత్రిక కార్యాలయాన్నీ గణేష్ నగర్ లోని విజయకుమార్ నివాసముండే అద్దె ఇంటిపక్కనే జీవగడ్డ సర్క్యులేషన్ మేనేజర్ నెల్లుట్ల వాసుదేవరావు వుండే అద్దె ఇంట్లో ప్రారంభించారు. ఇక్కడి నుండే విజయ్ కుమార్,దేవులపల్లి అమర్ ల ఆలోచనలు కలబోసుకుని “జీవగడ్డ” పత్రిక కు గట్టి పునాదులు పడ్డాయి.
దేవులపల్లి అమర్ కరీంనగర్ ఆంధ్రప్రభ స్టాప్ రిపోర్టర్ గా పనిచేసిన కాలంలోనే ఆ పత్రికకు ఎనలేని గుర్తింపు రావడం జరిగింది.అలాగే ఏ.పి.యు.డబ్ల్యు.జే(ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్స) సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా దేవులపల్లి అమర్ పనిచేసిన కాలంలోనే,జిల్లా వ్యాప్తంగా అన్ని పత్రికల్లో పనిచేసిన పాత్రికేయులు చైతన్యంతో జర్నలిజాన్ని ఒక ఆత్మగౌరవ ఉద్యమంగా కొనసాగించారు.
కరీంనగర్ కు రావడానికి ముందే దేవులపల్లి అమర్ జర్నలిస్టుగా,జర్నలిస్ట్ సంఘాల ఉద్యమ నాయకుని గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందివున్నాడు.
ఇక,బి.విజయ్ కుమార్ సంపాదకత్వంలో,న్యూస్ ఎడిటర్ గా కే. నరసింహచారి , సబ్ ఎడిటర్లుగా అల్లం నారాయణ,ఘంటా చక్రపాణి,రెవెళ్లి నరేందర్, రిపోర్టర్లుగా గోదావరిఖని నుండి పిట్టల రవీం
దర్,కరీంనగర్ నుండి తాడూరి కరుణాకర్,వై.ఎస్.శర్మ,కె.పి.రావు ,ఆ తర్వాతఎలగందుల రవీందర్ తదితరులతో “జీవగడ్డ” సాయంకాలం దినపత్రిక ప్రారంభమైంది.దేవులపల్లి అమర్ ఇఛ్చిన స్వేచ్చ తో
ఆ రోజుల్లో జిల్లావ్యాప్తంగా పనిచేసిన కొందరు ఆంధ్రప్రభ న్యూస్ కంట్రిబ్యూటర్లు కొద్ది కాలం పాటు జీవగడ్డకు కూడా వార్తలను అందించేవారు. అలాగే,మంథని నుండి నగునూరి శేఖర్,గోదావరిఖని నుండి బండారు కిష్టయ్య, పిట్టల రాజేందర్,పిట్టల రవీందర్, హుస్నాబాద్ నుండి మహమ్మద్ ఫజుల్ రహమాన్,అన్నవరం దేవేందర్,హుజురాబాద్ నుండి ఆవునూరి సమ్మయ్య, జగిత్యాల నుండి సి.హెచ్.వి.ప్రభాకర్ రావు,మంద భీంరెడ్డి,సిరిసిల్ల నుండి జూకంటి జగన్నాధం, వేములవాడ నుండి సంకేపల్లి నాగేంద్రశర్మ,ధర్మపురి నుండి సురేందర్, కేశవపట్నం నుండి కొరిమి వెంకట స్వామి,లు జీవగడ్డ కు అండగా వుండేవారు.
ఆ రోజుల్లో ఇంకా డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు.జీవగడ్డ పత్రిక మాన్యువల్ ప్రింటిగ్ ప్రెస్ లోనే అచ్చయ్యేది.
పత్రిక నిర్వహణ బాధ్యతల్లో అడుగడుగునా శారదా ప్రెస్ యజమాని బుడికే నాగభూషణం,సర్క్యులేషన్ మేనేజర్ నెల్లుట్ల వాసుదేవరావు,వై.ఎస్.శర్మ,
విజయ్ కుమార్ సోదరుడు కృపాకర్ లు ఉండి పత్రికను వెలువరించి,జిల్లావ్యాప్తంగా జీవగడ్డను పరిచయం చేసారు.వీరు మాన్యువల్ ప్రెస్ తో పత్రికను తీసుకురావడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అలాగే,అల్లంనారాయణ,ఘంటా చక్రపాణి,నరెడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్,అన్నవరం దేవేందర్,రెవెల్లి నరేందర్,గోపు లింగారెడ్డి తదితరులు వారానికి ఒక్కరి చొప్పున ప్రత్యేకమైన కథనాలను రాసేవారు.
కొద్దిరోజుల్లోనే “జీవగడ్డ”సాయంకాలం దిన పత్రిక ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ ,అధికార వర్గాల్లో ప్రభంజనాన్ని సృష్టిoచ్చింది.
అప్పటి వరకు విద్యుల్లత విజయ్ కుమార్ గా ఉన్న ఆయన జీవగడ్డ విజయ్ కుమార్ గా ప్రచారంలోకి వచ్చిండు.
అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు,
పౌరహక్కుల సంఘాలకు,మహిళా, ఉద్యోగ, కార్మిక,విద్యార్థి,ఉపాధ్యాయ సంఘాలకు,అధికారవర్గాలకు,అంతేకాదు,జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వివిధ పత్రికల స్టాప్ రిపోర్టర్లకు “జీవగడ్డ”కార్యాలయం ఒక అడ్డాగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రోజు సాయంకాలం జీవగడ్డ లో వచ్చిన వార్తలు మరుసటి రోజు ఉదయం ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికల్లో పేలేటివి. “జీవగడ్డ” పత్రిక ఆ రోజుల్లో జర్నలిస్ట్ ల ఉత్పత్తి కేంద్రంగా ఉండేది. ఇందులో పనిచేసిన అనేక మంది జర్నలిస్ట్ లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన దినపత్రికల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసి గుర్తింపును పొందారు.
అందుకే జీవగడ్డ అందరికి అడ్డా గా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “జీవగడ్డ”సాయంకాలం దినపత్రిక ప్రత్యేక గుర్తింపును పొందింది.
దేవులపల్లి అమర్,బి.విజయ్ కుమార్,కొండా లక్ష్మణ్ లు ఏ.పి.యు.డబ్ల్యూ,జే. నాయకులుగా వున్నప్పుడు ప్రస్తుత ప్రెస్ భవన్ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్ట్ లకు పెద్దదిక్కుగా ఉన్నబి.విజయ్ కుమార్ ప్రెస్ భవన్ నిర్మాణపు పనులను నిత్యం పర్యవేక్షించేవాడు.
విద్యార్థిదశలో బలంగా తనలో నాటుకున్న ఆలోచనా విధానాన్ని కానీ,అలాగే సాధారణమైన ఆహార్యాన్ని విజయ్ కుమార్ ఏ సందర్భంలోను వదలుకోలేదు.నిరాడంబర జీవితాన్ని గడిపి ఎందరికో ప్రేరణగా నిలిచిండు.
విజయ్ కుమార్ చనిపోయే నాటికి ఆయన కుటుంబం కరీంనగర్,గణేష్ నగర్ లోని అద్దె ఇంట్లోనే గడిపింది.చ నిపోయినప్పుడు ఆయన పార్ధీవ దేహాన్ని కరీంనగర్ ప్రెస్ భవన్లో పెట్టి,కుటుంబ సభ్యులతో కలిసి,జర్నలిస్టులందరు అక్కడినుండే ఆయన అంత్యక్రియలు జరిపించారు.
అంతేకాదు, జర్నలిస్టులందరు ఏకాభిప్రాయంతో కరీంనగర్ ప్రెస్ భవన్ కు బి.విజయ్ కుమార్ ప్రెస్ భవన్ గా నామకరణం చేసి పత్రికా రంగంలో విజయ్ కుమార్ స్ఫూర్తికి అండగా నిలవడం విశేషం.
*కొలనూరు టు కరీంనగర్*
*********************************
భాగ్యనగర్ విజయ్ కుమార్ స్వస్థలం ప్రస్తుత ఓదెల మండలం లోని కొలనూర్. విజయకుమార్ తల్లిదండ్రులు భాగ్యనగర్ సత్యనారాయణ,సుగుణమ్మల ది దిగువ మధ్యతరగతి కుటుంబం.అందువల్ల విజయ్ కుమార్ బాల్యంలోనే వీరి కుటుంబం ఉపాధి కోసం కొలనూర్ నుండి జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు మారింది.ఈ దంపతులకు ముగ్గురు కుమారులు వరసగా విజయ్ కుమార్,దయాకర్,కృపాకర్,కుమార్తెలు సుజాత,అరుణ లు.
సత్యనారాయణ కరీంనగర్ లో నేషనల్ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగిగా చేరి,ఆ తర్వాత
కరీంనగర్ శాస్త్రి రోడ్ లోనే విజయలక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ ను స్వంతంగా ఏర్పాటు చేసుకున్నాడు.వారి పెద్ద కుమారుడైన విజయ్ కుమార్ కు బాల్యం నుండే ప్రింటింగ్ ప్రెస్ పనులతో అనుబంధం ఏర్పడింది.మనుషుల ను ప్రేమించే గుణం కూడా మొదలైంది.
విజయ్ కుమార్ ఒకవైపు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే,మరోవైపు ప్రింటింగ్ ప్రెస్ లొ తండ్రికి సహాయంగా వుండే వాడు.
విజయ్ కుమార్ కు సహచరి సబిత, ఇద్దరు కుమార్తెలు సృజన,స్వేచ్చ వున్నారు.
ప్రస్తుతం సృజన హైదరాబాద్ లోను, స్వేచ్చ తల్లి సబితతో కలసి ఆస్ట్రేలియా లో వుంటున్నారు.
భాగ్యనగర్ విజయ్ కుమార్ అమర్ రహే…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !