: టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది. మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది.
8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం.
టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఇంజన్లలో మంటలు వ్యాపించాయి. దీంతో విమానం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం ఇవానోవో ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంది.
ఇటీవల రష్యాలో విమాన ప్రమాదాలు అనుమానాస్పదంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ వేళ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. రష్యా అధినేత పుతిన్‌కి ఎదురుతిరిగిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ కూడా ఇలాగే అనుమానాస్పదం విమాన ప్రమాదంలో మరణించారు. ఆగతంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న విమానం కూడా ఇలాగే ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా ప్రాంతంలో కుప్పకూలింది. ఈ సమయంలో ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు.