బాహు బలంన్యూస్ హుజూరాబాద్ న్యూస్ :
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సిర్సపల్లి వద్ద ప్రతిపాదించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త నుంచి విద్యుత్) ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వేదికగా శనివారం 24 గంటల నిరహర దీక్ష ప్రారంభమైంది. సామాజిక కార్యకర్త సబ్బని వెంకట్ చేపట్టిన ఈ దీక్షకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు భారీగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కారణంగానే హుజూరాబాద్ ప్రాంతం ఇతర జిల్లాల చెత్తకు నిలయంగా మారుతోందని మండిపడ్డారు.
ఏడాది కాలంగా హెచ్చరిస్తున్నా..
సిర్సపల్లిలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పర్యావరణ ముప్పు, ప్రజారోగ్య సమస్యలపై తాను ఏడాది కాలంగా గొంతెత్తుతున్నానని వెంకట్ గుర్తుచేశారు. “గత 2023లోనే ఈ ప్రతిపాదన వచ్చినప్పుడే నేను హెచ్చరించాను. ఎన్నికల హడావిడిలో పడి అప్పట్లో నాయకులు పట్టించుకోలేదు. కనీసం ప్రభుత్వం మారిన తర్వాతైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని భావించాం. కానీ, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల చెత్తను తీసుకువచ్చి మన నెత్తిన వేయడం ఎంతవరకు సమంజసం?” అని ఆయన ప్రశ్నించారు. సెంటర్ పాయింట్ పేరుతో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకోవడమేనని విమర్శించారు.
ప్రజా ప్రతినిధుల బాధ్యత రాహిత్యంపై ధ్వజం..
హుజూరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసి ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని వెంకట్ ధ్వజమెత్తారు. “మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక పార్టీ, ఎంపీ ఒక పార్టీ, ప్రభుత్వం మరో పార్టీ కావడంతో ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ఎమ్మెల్యే.. వ్యక్తిగత పంచాయితీలతో కాలక్షేపం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు తెలిసినా, ఎమ్మెల్యేకి సమాచారం ఉన్నా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని నిలదీశారు. టెంట్ రాజకీయం మాని, టెక్నికల్ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్య..
ఈ ప్లాంట్ వల్ల కలిగే నష్టాలపై ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పూర్తిస్థాయి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు వెంకట్ వెల్లడించారు. “నేను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారులను కలిశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులకు కూడా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. అలాంటిది మన ఎంపీ, ఎమ్మెల్యే ఎందుకు నేరుగా వెళ్లి ప్లాంట్ రద్దు కోసం ప్రయత్నించడం లేదు?” అని ప్రశ్నించారు. ప్రభుత్వం 15 రోజుల్లో నివేదిక తెప్పించుకుంటానని హామీ ఇచ్చిందని, ఒకవేళ నిర్ణయం అనుకూలంగా రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విద్యా సంస్థలు కావాలి.. డంపింగ్ యార్డులు కాదు!
డంపింగ్ యార్డ్ కోసం కేటాయించిన 164 ఎకరాల స్థలంలో ఇంజనీరింగ్ కాలేజీ లేదా మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని వెంకట్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో 72 గంటల భారీ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటిస్తూ.. ఈ పోరాటంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జిలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 107 గ్రామాల ప్రజల మద్దతుతో, వివిధ సామాజిక సంఘాల అండతో సిర్సపల్లి లో వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త నుంచి విద్యుత్) ప్లాంట్ నిర్మాణాన్ని ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు












