బాహు బలంన్యూస్, కరీంనగర్ ,జూన్ 2:
తెలంగాణ స్వరాష్ట్ర సిద్ధి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలాడి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమరవీరులందరికీ ప్రజా సంఘాల తరపున ఆయన భావోద్వేగంతో అంజలి ఘటించారు.
ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
వేడుకల్లో భాగంగా ఎల్.ఎమ్.డి మానేరు డ్యాం కట్టపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతు సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. “రాజకీయంగా ప్రాంతాలు విడిపోయినా, తెలుగు జాతి అంతా ఒక్కటే” అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రజా సంఘాల తరపున ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన నాడు ఏర్పడిన జేఏసీ (JAC)తో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ‘సకల జనుల సమ్మె’ వంటి పోరాటాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాత్ర అమోఘమైనదని ఆయన కొనియాడారు.
చారిత్రాత్మక నిర్ణయంతోనే స్వరాష్ట్రం
నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల చారిత్రాత్మక నిర్ణయం, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అందించిన పూర్తి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టరూపం దాల్చిందని రామారావు గుర్తుచేశారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ చట్టం 2014, జూన్ 2వ తేదీన అధికారికంగా అమల్లోకి వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న యోధులందరి కుటుంబాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించి గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజ్ఞప్తి చేశారు.
రైతు హామీలను తక్షణమే అమలు చేయాలి
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని రామారావు కోరారు. అదేవిధంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంటల సాగు సమయం ముంచుకొస్తున్నందున, ‘రైతు భరోసా’ నిధులను ఎలాంటి ఆలస్యం లేకుండా ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రైతులు పండించిన అన్ని రకాల పంటలకు ప్రకటించిన బోనస్ నిధులను, పంట కొనుగోలు డబ్బులతో కలిపి ఒకేసారి చెల్లించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఎరువుల కొరత రాకుండా సకాలంలో పంపిణీ కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ధాన్యపు కొనుగోళ్లను మరో వారం రోజుల్లోగా వేగవంతంగా పూర్తి చేసి, అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు.













