బాహు బలంన్యూస్ కరీంనగర్, ఏప్రిల్ 08 :
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ధ్రువతార, మాజీ మంత్రి కీ.శే. ముద్దసాని దామోదర్ రెడ్డి సామాన్యుల పక్షపాతి అని, ఆయన చేసిన అభివృద్ధి పనులు జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు పోలాడి రామారావు కొనియాడారు. బుధవారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ముద్దసాని అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. దివంగత నేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
సామాజిక న్యాయమే ఊపిరిగా ప్రజా ప్రస్థానం.
వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన ముద్దసాని దామోదర్ రెడ్డి, 1985లో అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యుడిగా అప్రతిహత విజయం సాధించారని తెలిపారు. మంత్రిగా పర్యాటక, గనులు, రవాణా, సాంకేతిక విద్యా శాఖల్లో తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో గ్రామగ్రామానికి బీటీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, స్కూల్ భవనాలు నిర్మించి మౌలిక వసతుల కల్పనలో ఆదర్శంగా నిలిచారని అన్నారు. గ్రామాల్లో పెత్తందార్ల పాలిట సింహస్వప్నంలా ఉంటూ, అట్టడుగు వర్గాలకు అండగా నిలిచిన సామాజిక న్యాయవాది ముద్దసాని అని ప్రశంసించారు. బలహీన వర్గాల కోసం ప్రభుత్వం నుంచి స్థలాలు కొనుగోలు చేయించి, పట్టాలు ఇప్పించి సామూహిక ఇండ్ల కాలనీలు నిర్మించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
రైతు బాంధవుడు.. యువతకు ఆశాజ్యోతి.
రైతుల సంక్షేమం కోసం దామోదర్ రెడ్డి పడిన తపన వెలకట్టలేనిదని, ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేలా నిరంతరం పర్యవేక్షించేవారని రామారావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరిగేలా చేసి రైతులకు మేలు చేకూర్చారని వివరించారు. “నన్ను ప్రజా బాహుళ్యానికి పరిచయం చేసి, ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ముద్దసాని. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది” అని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఆశాజ్యోతిగా నిలిచిన ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.
రేపు విగ్రహావిష్కరణ – ప్రముఖుల రాక
ముద్దసాని దామోదర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని గురువారం అలుగునూరు సమీపంలోని సదాశివపల్లి తీగల వంతెన హైవే రహదారిపై ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మరియు ముద్దసాని కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఆత్మీయ సమావేశంలో నాయకులు గోపు గోపాల్ రెడ్డి, రాచమడుగు నరసింగారావు, పుప్పాల రఘు, వెన్నమనేని విక్రమసింహారావు, మూల పుల్లారెడ్డి, కలకుంట్ల సత్యనారాయణరావు, చందా గాంధీ, గోలి రాజేశ్వర్ రావు, పోల్నేని సత్యనారాయణరావు, గంగాటి తిరుపతి రెడ్డి, తణుకు ప్రభాకర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.











