బాహు బలంన్యూస్,హన్మకొండ, మే 27 :
రాష్ట్రంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పరిష్కారానికి, ఎన్నికల వేళ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనకై ఈనెల 30వ తేదీ శనివారం నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో లక్షలాది మందితో ‘రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమరభేరి’ సభను నిర్వహించ తలపెట్టినట్లు రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండలోని పోస్టల్ కాలనీలో గల ఉమ్మడి జిల్లా రైతు సంఘాల జేఏసీ నాయకుడు తక్కళ్లపెల్లి సత్యనారాయణ రావు నివాసంలో రాష్ట్ర, వివిధ జిల్లాల మహిళా సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మహా గర్జన సమరభేరి సభకు సంబంధించిన ప్రచార సామాగ్రి, ఆహ్వాన పత్రికలను నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. సభకు హాజరు కావాల్సిందిగా మహిళా ప్రతినిధులను ఆహ్వానించగా, వారు సానుకూలంగా స్పందించి ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల మంది మహిళలతో తరలివచ్చి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించారు.
హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం..
అనంతరం పోలాడి రామారావు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్లక్ష్య వైఖరిని వీడి, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఐలియాడ్లలో, మార్కెట్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సగం మందికే రుణమాఫీ.. ఎగనామం పెట్టిన రైతు భరోసా!
రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, కేవలం సగం మందికి మాత్రమే వర్తింపజేసి చేతులు దులుపుకుందని రామారావు విమర్శించారు. మిగిలి ఉన్న అర్హులైన రైతులందరికీ వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను తూతూమంత్రంగా కాకుండా పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్నికల హామీ మేరకు అన్ని రకాల పంటలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాల్సి ఉండగా, కేవలం సన్న రకాలకు మాత్రమే అడపా దడపా, అరకొరగా ఇస్తూ రైతులను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా నిధులు విడుదల చేసిందని.. ఈ సర్కార్‌కు రైతన్నల ఉసురు తగలక తప్పదని ఆయన హెచ్చరించారు. మరోవైపు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు.
రైతు ప్రజా సంఘాల ఐకాస ప్రధాన డిమాండ్లు…
కరీంనగర్ వేదికగా జరగబోయే సమరభేరి సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పలు కీలక డిమాండ్లను ఈ సందర్భంగా రామారావు తెరపైకి తెచ్చారు.
రైతు బీమా వయోపరిమితి పెంపు: ప్రస్తుతమున్న రైతు బీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలి.
రైతు పెన్షన్ పథకం: 50 ఏళ్లు నిండిన ప్రతి పేద రైతుకు నెలకు రూ. 6 వేల చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
ఉచిత వైద్యం: రైతు కుటుంబాల సంక్షేమార్థం అన్ని విభాగాల్లో రూ. 20 లక్షల ఉచిత వైద్య సౌకర్యం కల్పించేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
ఉపాధి హామీ అనుసంధానం: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (ఉపాధి హామీ కూలీలను) వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి.
రైతు చట్టం: పంటలకు రైతే స్వయంగా గిట్టుబాటు ధర నిర్ణయించుకునేలా, రైతుల భాగస్వామ్యంతో కూడిన నూతన రైతు చట్టాన్ని తీసుకురావాలి.
సకాలంలో పెట్టుబడి సాయం: పంటల సాగు సమయం ప్రారంభంలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో విడుదల చేయాలి.
పార్టీలకతీతంగా కదలిరావాలి..
రైతాంగం ఎదుర్కొంటున్న ఈ మనుగడ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. మే 30న కరీంనగర్‌లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి మహా గర్జన సభకు రాజకీయ పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు మాదాటి శ్రీలక్ష్మి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దావ వసంత, ఉపాధ్యక్షురాలు తక్కళ్లపెల్లి మాధవి, కోశాధికారి రత్నమాలతో పాటు వివిధ జిల్లాల మహిళా అధ్యక్షులు, ప్రతినిధులు ఎర్రబెల్లి స్వప్న, కంకణాల విజయ, శ్రీలత రెడ్డి, రాధ, పద్మ, శిరీష, సమత, మౌనిక, జయ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.












